దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో షాపింగ్ సందడి నెలకొంది. వస్త్ర దుకాణాలు, జ్యువెలరీ షాపులు, షాపింగ్ మాల్స్‌లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.

ఆదివారం సద్దుల బతుకమ్మ పండుగ కోసం మహిళలు పెద్ద ఎత్తున పూలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేశారు. మంగళవారం దసరా పండుగ నేపథ్యంలో దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.

ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నగరంలోని అన్ని ప్రధాన వీధులు వినియోగదారులతో నిండిపోయాయి. ప్రజలు కొత్త దుస్తులు, గృహోపకరణాలు, వాహనాలు, బంగారు నగలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

చార్మినార్, అబిడ్స్, సుల్తాన్‌ బజార్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, అమీర్‌పేట, బేగంబజార్, కోఠి వంటి ముఖ్య ప్రాంతాల్లో ఈ షాపింగ్ సందడి ఎక్కువగా ఉంది.

ఈ దసరా సీజన్‌లో వ్యాపారం రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై వ్యాపారులు భారీ ఆఫర్లను అందిస్తున్నారు.