హైదరాబాద్ / అస్తానా: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు కజకిస్థాన్ విమానయాన సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి. 7వ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రపంచ విమాన రవాణా సదస్సు సందర్భంగా జరిగిన చర్చల్లో ఈ ప్రతిపాదనపై భారత్ ప్రాథమిక సానుకూలత తెలిపింది.

కజకిస్థాన్ ప్రతినిధి బృందానికి రవాణా ఉప మంత్రి తల్గాట్ లస్తా యెవ్, భారత బృందానికి పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా నేతృత్వం వహించారు. హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలకు కొత్త రూట్లు ప్రారంభించేందుకు కజక్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి చూపగా, హైదరాబాద్‌కు విమాన సేవల విస్తరణకు భారత్ ప్రాథమికంగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం భారత్–కజకిస్థాన్ మధ్య వారానికి 18 విమానాలు నడుస్తున్నాయి. వీటిలో అల్మాటీ–ఢిల్లీ మధ్య 12 (ఎయిర్ అస్తానా 7), అల్మాటీ–ముంబై మధ్య 3 (ఎయిర్ అస్తానా 2), అస్తానా–గోవా మధ్య 1 (SCAT), అల్మాటీ–గోవా మధ్య 2 (SCAT, ఫ్లైఅరిస్తాన్) సర్వీసులు ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి కజకిస్థాన్‌కు నేరుగా విమానాలు లేవు.

ఇరు దేశాల మధ్య త్వరలో ద్వైపాక్షిక విమాన సర్వీసుల చర్చలు జరగనున్నాయి. ఇందులో ట్రాఫిక్ హక్కులు, ఎయిర్‌లైన్ల కేటాయింపు, ప్రారంభ తేదీలను ఖరారు చేస్తారు. మధ్య ఆసియాలో చదువుతున్న తెలుగు వైద్య విద్యార్థులు, ప్రవాసాంధ్రులకు ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది.