ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, నంది అవార్డు గ్రహీత, సామాజిక సేవకులు డాక్టర్ బుక్కా సత్యనారాయణకు సాహితీ సేవా పురస్కారం లభించింది. గుంటూరులోని భారతీయ విద్యా భవన్లో జరిగిన ఒక మహోత్సవంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఈ పురస్కారాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గజల్ నాయకుడు, మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ 50 వసంతాల సంగీత ఉత్సవం, 40 వసంతాల గజల్ గాన వేడుకలు, 60 వసంతాల తెలుగు గజల్ కు నీరాజనం మహోత్సవం సందర్భంగా ప్రదానం చేశారు.
గుంటూరు జిల్లా పరిషత్ రోడ్డులోని భారతీయ విద్యా భవన్లో బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా వేదికపై డాక్టర్ గజల్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వి కృష్ణమోహన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ చైర్మన్ గుమ్మడి గోపాల్ కృష్ణ, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, వేద పండితుడు శివ సాయి శర్మ చేతుల మీదుగా సత్యనారాయణకు శాలువతో సత్కరించి ప్రశంసా పత్రం అందజేశారు.
డాక్టర్ బుక్కా సత్యనారాయణ సాహితీ సేవలు, సామాజిక కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణం. ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావడం తెలంగాణ సాహిత్య రంగానికి మరింత వన్నె తెచ్చింది.



