హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ, హైటెక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగే 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రంగ అభివృద్ధికి పలు కీలక ప్రకటనలు చేశారు.

48 గంటల్లో దానా సమస్యకు పరిష్కారం

పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న కోళ్ల దానా సమస్య, అనుమతుల జాప్యంపై నిర్వాహకులు చేసిన విజ్ఞప్తిపై సీఎం స్పందించారు. సోయా, మొక్కజొన్న సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై 48 గంటల్లో సమీక్ష నిర్వహించి నిర్ణయం ప్రకటించాలని మంత్రులను ఆదేశించారు. తెలంగాణలో ప్రతిరోజూ 5 కోట్ల 30 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని, ప్రభుత్వ హాస్టళ్లలో వారానికి మూడు గుడ్లు, చికెన్ అందిస్తున్నామని సీఎం తెలిపారు.

ప్రాధాన్యత రంగం హోదా, భూమి కేటాయింపు

ఫ్యూచర్ సిటీలో అమలు చేస్తున్న 'బిల్డ్ నౌ' (BuildNow) సింగిల్ విండో యాప్‌ను త్వరలోనే గ్రామాలకు విస్తరించి పౌల్ట్రీ ఫారాలకు వేగంగా అనుమతులు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐటీతో పాటు పౌల్ట్రీని ప్రాధాన్యత రంగంగా గుర్తించి, గ్లోబల్ సమ్మిట్‌కు అనుబంధంగా భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.