అమరావతి, నవంబర్ 20: రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాలను (ఎకనమిక్ రీజియన్లు) ప్రత్యేక పారిశ్రామిక, సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దే బ్లూప్రింట్‌పై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గురువారం సమీక్షించారు. కేవలం పెట్టుబడుల ప్రకటనలకే పరిమితం కాకుండా, వాటిని వేగంగా ప్రాజెక్టులుగా మార్చి తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ 'సిటీ ఎకనమిక్ రీజియన్' పథకం కింద ప్రతిపాదించిన రూ.9,180 కోట్ల విలువైన 60 ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
విశాఖ ఆర్థిక ప్రాంతం: బే-టెక్ సిటీ, పోర్టు ఆధారిత పరిశ్రమలు
విశాఖ ఎకనమిక్ రీజియన్ (VER) పరిధిలో ఐటీ, డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత తయారీ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. హైదరాబాద్ సైబరాబాద్ తరహాలో విశాఖకు అనుబంధంగా 'వైజాగ్ బే-టెక్ సిటీ'ని నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో గుర్తించిన 167 ప్రాజెక్టుల్లో ఇప్పటికే 64 పనులు ప్రారంభమయ్యాయని సమీక్షలో అధికారులు వివరించారు. నక్కపల్లి, కాకినాడల్లో పారిశ్రామిక నగరాలతో పాటు, రూ.70,000 కోట్ల అంచనా పెట్టుబడితో 25 మిలియన్ టన్నుల (MMTPA) స్టీల్, 12 మిలియన్ టన్నుల పెల్లెట్ సామర్థ్యంతో స్టీల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలో పేర్కొన్నారు.
అమరావతి: క్వాంటం వ్యాలీ, రూ.4.65 లక్షల కోట్ల ప్రాజెక్టులు
తొమ్మిది జిల్లాలతో కూడిన అమరావతి ఎకనమిక్ రీజియన్ (AER) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సుమారు 35 శాతం వాటాతో రూ.6.23 లక్షల కోట్ల స్థాయిలో ఉందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఇక్కడ రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడిన 48 ప్రధాన ప్రాజెక్టులతో పాటు, రూ.1.54 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రతిపాదనలను గుర్తించారు. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ, 90 లక్షల చదరపు అడుగుల టెక్నాలజీ పార్క్, పల్నాడులో 250 ఎకరాల తయారీ హబ్‌ను ప్రతిపాదించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల అనుసంధానంతో ఎగుమతులు, పెట్రోకెమికల్స్, ఆక్వాకల్చర్ వాల్యూ చైన్లను బలోపేతం చేయనున్నారు.
తిరుపతి: సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ కేంద్రం
తిరుపతి ఎకనమిక్ రీజియన్ (TER) పరిధిలో పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల పైప్‌లైన్ ఉందని అధికారులు తెలిపారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ వాటా అత్యధికంగా ఉండగా, ఆటోమోటివ్-ఈవీ రంగానికి రూ.53,500 కోట్లు, సెమీకండక్టర్లకు రూ.38,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌కు రూ.36,000 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయి. శ్రీసిటి, నాయుడుపేటలను ఎలక్ట్రానిక్స్ కేంద్రాలుగా, కర్నూలులోని గుట్టపాడును సెమీకండక్టర్ హబ్‌గా, తిరుపతి-శ్రీహరికోటను స్పేస్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడు ప్రాంతాల్లోనూ భారీ పరిశ్రమలకు అనుబంధంగా స్థానిక ఎంఎస్ఎంఈ (MSME)లను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయం కోసం తిరుపతిలో ఐఐటీ, అమరావతిలో బిట్స్ పిలానీ వంటి సంస్థలను నాలెడ్జ్ పార్ట్నర్లుగా అనుసంధానించాలని ప్రతిపాదించారు. విజయనగరం, అనకాపల్లితో పాటు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.




