పుణె / విశాఖపట్నం: పుణెలో జరుగుతున్న తొలి ఇండియా ఇంటర్నేషనల్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2026లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు మూడు పతకాలతో మెరిశారు. వరల్డ్ తైక్వాండో, ఆసియన్ తైక్వాండో యూనియన్ ఆధ్వర్యంలో ఇండియా తైక్వాండో నిర్వహిస్తున్న ఈ జీ1 (G1) ర్యాంకింగ్ టోర్నీలో ఏపీకి ఒక రజతం, రెండు కాంస్య పతకాలు దక్కాయి.
మహిళల అండర్-40 విభాగంలో కర్నూలుకు చెందిన కె. సురేఖ రజత పతకం కైవసం చేసుకున్నారు. మహిళల అండర్-30 పూమ్సే (poomsae) విభాగంలో విశాఖపట్నం మిథిలేశ్ తైక్వాండో అకాడమీ క్రీడాకారిణి ఎన్. సుమిత (18) కాంస్య పతకం సాధించారు. సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో బీఏ ఇంగ్లీష్ చదువుతున్న సుమిత, ఏపీ నుంచి జీ1 పతకం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారని ఆమె కోచ్ మిథిలేశ్ పల్లం తెలిపారు.
పురుషుల అండర్-50 వ్యక్తిగత పూమ్సే విభాగంలో ఎ. నాగరాజు కాంస్య పతకం గెలుచుకున్నారు. నవంబర్ 20న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ పోటీలు నవంబర్ 25 వరకు కొనసాగనున్నాయి.
ఈ టోర్నీలో కోచ్ మిథిలేశ్ పల్లం శిక్షణలో మొత్తం ఏడుగురు క్రీడాకారులు బరిలోకి దిగారు. మిగిలిన విభాగాల్లోనూ ఏపీ క్రీడాకారులు పతకాల కోసం పోటీపడుతున్నారు.




