హైదరాబాద్: అంతర్జాతీయ చెస్ వేదికపై తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ వుప్పల ప్రణీత్ మరో ఘనత సాధించాడు. వెనెజువెలాలో జరిగిన వరల్డ్ అండర్-20 చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

నల్లగొండ జిల్లా అలగడప గ్రామానికి చెందిన 19 ఏళ్ల ప్రణీత్, గతంలో అండర్-11 విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించాడు. 2022 మార్చిలో ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) టైటిల్ గెలుచుకున్న ఆయన, 2023లో తన చివరి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను పూర్తి చేసి భారతదేశపు 82వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు.

గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు శిక్షణ ఇచ్చిన RACE అకాడమీ కోచ్ ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద ప్రణీత్ చెస్ మెళకువలు నేర్చుకున్నాడు.

ప్రపంచ జూనియర్ వేదికపై ప్రణీత్ పతకం సాధించడంపై తెలంగాణ క్రీడా వర్గాలు, చెస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.