మొహాలీ / కోల్‌కతా / నాగ్‌పూర్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026–27లో ఆంధ్ర జట్టు అదరగొట్టింది. ఎలైట్ గ్రూప్-సిలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 24 పాయింట్లు సాధించి సూపర్ లీగ్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్ర నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని హేమంత్ రెడ్డి (64; 35 బంతుల్లో), షేక్ రషీద్ (53; 43 బంతుల్లో) అర్ధశతకాలతో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బౌలింగ్‌లో ఆంధ్ర పేసర్ పీవీఎస్‌ఎన్ రాజు 7 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో (బెస్ట్ 4/14, ఎకానమీ 7.10) గ్రూప్ దశలో సంయుక్త అగ్రస్థానంలో నిలిచారు.
మరోవైపు గ్రూప్-డిలో ఒడిశాపై 5 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసినా హైదరాబాద్‌కు నిరాశ తప్పలేదు. ఒడిశా 206/8 స్కోరు చేయగా, కొడిమెల హిమతేజ (81 నాటౌట్; 45 బంతుల్లో) మెరుపులతో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 207/5 చేసి గెలిచింది. అయితే ముంబై (26), విదర్భ (26) తర్వాత 18 పాయింట్లతో మూడో స్థానంలో నిలవడంతో సూపర్ లీగ్ బెర్త్ చేజారింది. హిమతేజ 6 ఇన్నింగ్స్‌ల్లో 315 పరుగులతో (స్ట్రైక్ రేట్ 159.09) రాణించారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు నాగ్‌పూర్‌లో జరిగే సూపర్ లీగ్ గ్రూప్-బిలో ముంబై, పంజాబ్, రాజస్థాన్‌లతో ఆంధ్ర తలపడనుంది. డిసెంబర్ 6న జంథా స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.




