అమరావతి: రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా అమరావతి ఎకనామిక్ రీజియన్ (ఏఈఆర్)ను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) తన భాగస్వామ్య సంస్థలైన లాసా (LASA), పీడబ్ల్యూసీ ఇండియాతో కలిసి రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్‌కు 2027 జూలై నాటికి తుది రూపం ఇవ్వనుంది.
ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాల పరిధిలో 44,817 చదరపు కిలోమీటర్ల మేర ఏఈఆర్ విస్తరించి ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇది 27 శాతం కాగా, ₹6.23 లక్షల కోట్ల విలువతో రాష్ట్ర జీఎస్డీపీలో 35 శాతం వాటాను అందిస్తోంది.
ఈ ప్రాంతంలో మొత్తం 48 భారీ ప్రాజెక్టుల ద్వారా ₹4.65 లక్షల కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్ ఉంది. ఇందులో అత్యధికంగా పునరుత్పాదక ఇంధన రంగానికి ₹1.48 లక్షల కోట్లు కేటాయించారు. ప్రకాశం జిల్లాలో ₹96,862 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ-పెట్రోకెమికల్ హబ్, ₹69,000 కోట్లతో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు, ₹1,200 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) యూనిట్ రానున్నాయి.
మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ నేతృత్వంలో ₹8,000 కోట్ల నౌకానిర్మాణ క్లస్టర్, అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ ($1 బిలియన్ లక్ష్యం), పల్నాడులో 250 ఎకరాల్లో క్వాంటం మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ (వార్షిక ఎగుమతులు ₹5,000 కోట్ల అంచనా) ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఈ ప్రణాళికపై నవంబర్ 24 నుంచి డిసెంబర్ 18 వరకు సీఆర్డీఏ 8 రంగాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనుంది.




