అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయం (స్పెషల్ మార్జిన్‌తో కలిపి) ₹74,342 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ₹11,738 కోట్లు అదనంగా సమకూరి 18.7 శాతం వృద్ధి నమోదైందని సచివాలయంలో బుధవారం జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు వివరించారు.
శాఖల వారీగా వసూళ్లు
వార్షిక లక్ష్యం ₹1,27,506 కోట్లలో ఇప్పటివరకు 58 శాతం పూర్తయింది. పన్ను ఆదాయం గత ఏడాది ₹53,692 కోట్ల నుంచి 18.8 శాతం వృద్ధితో ₹63,796 కోట్లకు పెరిగింది. ఎక్సైజ్ శాఖ ₹20,083 కోట్లు (19.6% వృద్ధి), స్టాంపులు-రిజిస్ట్రేషన్లు ₹8,020 కోట్లు (16.6% వృద్ధి), వాణిజ్య పన్నులు ₹5,917 కోట్లు (18.3% వృద్ధి), రవాణా పన్నులు ₹3,649 కోట్లు (17.3% వృద్ధి), మైన్స్ ₹2,086 కోట్లు (13.2% వృద్ధి) వసూలు చేశాయి. జీఎస్టీ ఆదాయం ₹3,694 కోట్లు పెరిగి 18.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
123 యూఎల్బీలలో AI పన్ను వ్యవస్థ
పన్నేతర ఆదాయం 31.3 శాతం పెరిగి ₹1,330 కోట్ల నుంచి ₹2,091 కోట్లకు చేరింది. నవంబర్ 20 నాటికి పట్టణ స్థానిక సంస్థలు ₹2,365 కోట్లు, పంచాయతీలు ₹238 కోట్లు వసూలు చేశాయి. వాణిజ్య పన్నుల శాఖలో ఏప్రిల్ నుంచి అమల్లో ఉన్న AI స్టాక్‌ను ఇప్పుడు 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రవేశపెడుతున్నారు. ప్రజలపై అదనపు పన్ను భారం వేయకుండా పారదర్శకతతో ఆదాయం పెంచాలని సీఎం ఆదేశించారు.




