విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానించే లక్ష్యంతో విశాఖపట్నంలో సోమవారం ఏషియాన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ 2026 ప్రారంభమైంది. నవంబర్ 23, 24 తేదీల్లో జరుగుతున్న ఈ సదస్సులో 11 ఏషియాన్ దేశాల ప్రతినిధులతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, నేవీ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలోని 1,053 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ కేంద్రంగా మారుస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. విశాఖపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందని వివరించారు. ప్రస్తుతం రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద 4 కొత్త పోర్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

కేంద్ర కేబినెట్ ప్రకటించిన ₹70,000 కోట్ల మారిటైం ప్యాకేజీలో భాగంగా దుగరాజపట్నంలో ₹30,000 కోట్ల షిప్ బిల్డింగ్ క్లస్టర్ ను ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. గత వారం విశాఖలో ₹7,500 కోట్ల విలువైన 5 మారిటైం ఒప్పందాలు కుదిరాయని గుర్తు చేశారు.

డిజిటల్, హరిత ఇంధన రంగాల్లోనూ విశాఖలో గూగుల్ $15 బిలియన్ల AI హబ్, 3 సబ్ సీ కేబుళ్లు వస్తున్నాయని, తర్లువాడలో సెమీకండక్టర్ అసెంబ్లీ యూనిట్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. కాకినాడ నుంచి జపాన్ కు చెందిన జెరా సంస్థకు ఏటా 70,000 టన్నుల గ్రీన్ అమ్మోనియా సరఫరా చేసేందుకు ఏఎం గ్రీన్ ఒప్పందం చేసుకుందని, 2028 నాటికి 5,000 మంది మారిటైం నిపుణులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్ వివరించారు.