హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ హైదరాబాద్ లో తన ఉనికిని మరింత విస్తరించింది. సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్, నెక్లెస్ రోడ్ మధ్య ఉన్న 2.25 ఎకరాల ప్రైమ్ స్థలాన్ని ₹180 కోట్లకు కొనుగోలు చేసి, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు కంపెనీ సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది.

ఎకరాకు ₹80 కోట్ల చొప్పున ఈ కొనుగోలు జరిగింది. ఈ స్థలంలో ప్రీమియం నివాస ప్రాజెక్టును నిర్మించనున్నట్లు, దీని ద్వారా సుమారు ₹1,000 కోట్ల ఆదాయ అవకాశం ఉందని బ్రిగేడ్ అంచనా వేస్తోంది.

హైదరాబాద్ తమకు కీలక వృద్ధి మార్కెట్ అని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసూర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో బ్రిగేడ్ పూర్తి చేసిన, కొనసాగుతున్న, రాబోయే ప్రాజెక్టుల పరిధి సుమారు 14 మిలియన్ చదరపు అడుగులకు చేరిందని, ఇందులో 4 మిలియన్ చదరపు అడుగుల పైప్ లైన్ ఉందని తెలిపారు.

సోమవారం ఎన్ఎస్ఈలో బ్రిగేడ్ ఎంటర్ ప్రైజెస్ షేరు 0.57 శాతం లాభంతో ₹581.65 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ ₹18,979.15 కోట్లుగా ఉంది. క్యూ2 ఎఫ్ వై27లో సంస్థ ఏకీకృత నికర లాభం వార్షికంగా 28.5 శాతం పెరిగి ₹218.82 కోట్లకు చేరగా, ఆదాయం 12.6 శాతం తగ్గి ₹1,250 కోట్లుగా నమోదైంది.