హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లోని 'లాకోన్స్' (అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ ప్రయోగశాల) చీఫ్ సైంటిస్ట్, ఏసీఎస్‌ఐఆర్ ప్రొఫెసర్ డా. గోవిందస్వామి ఉమాపతి ప్రతిష్ఠాత్మక జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (ఎన్‌ఏఏఎస్) ఫెలోగా శుక్రవారం ఎన్నికయ్యారు.

2000 సంవత్సరం నుంచి లాకోన్స్‌లో పరిశోధనలు నిర్వహిస్తున్న ప్రొ. ఉమాపతి బృందం వన్యప్రాణుల సంరక్షణ జన్యుశాస్త్రం, ఎండోక్రినాలజీ, ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ (ఇ-డీఎన్‌ఏ) ఆధారిత జీవవైవిధ్య పర్యవేక్షణలో ఆధునిక బయోటెక్నాలజీ సాధనాలను అభివృద్ధి చేస్తోంది.

పశువుల పేడ నమూనాల ఆధారంగా ఎలాంటి నొప్పి లేకుండా గర్భధారణను నిర్ధారించే వినూత్న డయాగ్నస్టిక్ కిట్‌ను ఆయన బృందం రూపొందించి, దానికి అమెరికా పేటెంట్ కూడా పొందడం విశేషం.

వ్యవసాయ, పశుసంవర్ధక, జీవవైవిధ్య శాస్త్ర రంగాల్లో హైదరాబాద్ పరిశోధనా సంస్థల కృషికి ఈ ఫెలోషిప్ మరో జాతీయ గుర్తింపుగా నిలిచింది.