హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిపాలనా అవసరాల కోసం శేరిలింగంపల్లి మండలం ఇజ్జత్‌నగర్‌లో ₹169 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ట్విన్-టవర్ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు బుధవారం ఈ-టెండర్లు ఆహ్వానించింది. కొత్తకుంట చెరువును ఆనుకుని ఉన్న 4.11 ఎకరాల స్థలంలో ఈ నెట్-జీరో గ్రీన్ బిల్డింగ్ కాంప్లెక్స్ రూపుదిద్దుకోనుంది.
విస్తీర్ణం, సదుపాయాలు
సీఎంసీ కమిషనర్ జి. సృజన పర్యవేక్షణలో అంతర్జాతీయ ఐటీ క్యాంపస్ ప్రమాణాలతో ఈ డిజైన్ రూపొందించారు. మొత్తం 2,41,540 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాలో జి+6, జి+8 అంతస్తులతో రెండు అనుసంధానిత టవర్లు నిర్మిస్తారు. ఇందులో కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఉంటాయి.
గ్రీన్ టెక్నాలజీ, తదుపరి దశ
సౌర విద్యుత్, మురుగునీటి రీసైక్లింగ్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సీఎంసీ హైటెక్స్ సమీపంలోని న్యాక్ (NAC) భవనంలో తాత్కాలికంగా పనిచేస్తోంది. డిసెంబర్ ఆరంభంలో టెండర్ బిడ్డింగ్ ముగిసిన తర్వాత కాంట్రాక్టు ఖరారు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.




