హైదరాబాద్: తెలంగాణలో సంప్రదాయంగా బలంగా ఉన్న ఐటీ, ఫార్మా రంగాల కంటే రక్షణ, ఏరోస్పేస్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ తెలంగాణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కాంక్లేవ్-2026లో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తితో పాటు ఎగుమతులు వార్షికంగా 100 శాతం పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మాజీ పైలట్‌గా మిగ్-23 విమానాన్ని నడిపిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ తయారీపై భారత్ దృష్టి సారించడం హైదరాబాద్‌కు కలిసివస్తోందన్నారు.
విమాన విడిభాగాలు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్లు, రోబోటిక్స్, AI రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద అంతర్జాతీయ సంస్థలు స్థానిక ఎంఎస్‌ఎంఈలతో కలిసి పనిచేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా గొలుసును బలోపేతం చేయాలని కోరారు.
'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026'లో భాగంగా జరిగే 'రక్షా ఎక్స్‌పో-2026'లో పాల్గొనాలని పరిశ్రమ వర్గాలను ఆయన ఆహ్వానించారు. ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు జి. సతీశ్ రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.




