హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో సుమారు ₹4,000 కోట్ల పెట్టుబడితో తన తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా శనివారం పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెయిల్ ప్లాంటును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తితో కలిసి ప్లాంటును సందర్శించిన భట్టి, సఫ్రాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ తదితర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుత సదుపాయాల విస్తరణపై ఇరుపక్షాలు చర్చించాయి.

వచ్చే నెల డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్'కు సఫ్రాన్ ప్రతినిధి బృందాన్ని ఉప ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సదస్సులోనే ₹4,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

బోయింగ్, ఎయిర్‌బస్ వంటి విమాన తయారీ సంస్థలకు ఇంజిన్లు సరఫరా చేసే సఫ్రాన్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే కీలక కేంద్రాలు ఉన్నాయి. లీప్ (LEAP) ఇంజిన్ల రొటేటింగ్ పార్ట్స్ తయారీ యూనిట్, విద్యుత్ పరికరాల ప్లాంటుతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) సదుపాయాల్లో ఒకటి హైదరాబాద్‌లో నడుస్తోంది.