లక్నో / హైదరాబాద్: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు క్రీడాకారులు శుక్రవారం సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టారు. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్స్, రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్లైన హైదరాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ సెమీఫైనల్‌కు చేరింది.
క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఏడో సీడ్ మార్గోట్ లాంబెర్ట్–కామిల్లె పోగ్నాంటే జోడీ వాక్‌ఓవర్ ఇవ్వడంతో గాయత్రి–ట్రీసా నేరుగా ముందంజ వేశారు. వరుసగా మూడో టైటిల్ సాధించడానికి వీరు మరో రెండు విజయాల దూరంలో నిలిచారు.
మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో తెలంగాణకు చెందిన సాత్విక్ రెడ్డి కనపురం, రేషిక ఉదయసూరియన్ జోడీ భారత్‌కే చెందిన విరాజ్ కువాలే–రుతపర్ణ పాండాపై 21–8, 21–14 తేడాతో సునాయాస విజయం సాధించింది. సెమీఫైనల్‌లో సాత్విక్–రేషిక జోడీ మలేషియాకు చెందిన వీ యీ హెర్న్–వన్నీ గోబితో తలపడనుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది.




