హైదరాబాద్: భారత సంతతికి చెందిన కార్పొరేట్ నేతలతో హురున్ సంస్థ గురువారం విడుదల చేసిన హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ జాబితా–2026లో హైదరాబాద్‌లో పుట్టిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రెండో స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ విలువ 2.6 లక్షల కోట్ల డాలర్లుగా జాబితా పేర్కొంది. గత జాబితాతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ విలువ 17 శాతం తగ్గగా, ఆల్ఫాబెట్ విలువ 98 శాతం పెరిగి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దీంతో ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తొలి స్థానానికి వచ్చారు.

టాప్ 5

  • 1. సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్)
  • 2. సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)
  • 3. సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ; విలువ 1,174% పెరిగి 1.4 లక్షల కోట్ల డాలర్లు)
  • 4. నీల్ మోహన్ (యూట్యూబ్)
  • 5. థామస్ కురియన్ (గూగుల్ క్లౌడ్)

భారత్ వెలుపల ప్రధాన కార్యాలయాలున్న 200 కంపెనీలకు నేతృత్వం వహిస్తున్న 236 మంది భారత సంతతి నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ కంపెనీల మొత్తం విలువ 15 లక్షల కోట్ల డాలర్లు. 2024 నాటి 9.9 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 53 శాతం ఎక్కువ. ఈ కంపెనీల్లో సుమారు 53 లక్షల మంది పనిచేస్తున్నారు. జాబితాలోని 58 శాతం మంది భారత్‌లోనే డిగ్రీ పూర్తి చేశారు. అమెరికా నుంచి 177 మంది, యూఏఈ, బ్రిటన్‌ల నుంచి చెరో 15 మంది ఉన్నారు. 2026 జూన్ 25 నాటి కంపెనీ విలువల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు.

సత్య నాదెళ్ల 1967లో హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన తండ్రి స్వస్థలం అనంతపురం జిల్లా బుక్కాపురం. 2014 నుంచి ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్నారు.