క్రైస్ట్‌చర్చ్ / హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. హెగ్లే ఓవల్‌లో శుక్రవారం మొదలైన రెండో టెస్టు తుది జట్టు నుంచి కూడా సిరాజ్‌ను పక్కన పెట్టారు. విశాఖపట్నం ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి సైతం అవకాశం లభించలేదు.
2020లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రతి విదేశీ పర్యటనలోనూ కనీసం ఒక టెస్టు ఆడుతూ వచ్చిన సిరాజ్ ఆరేళ్ల పరంపర ఈ మ్యాచ్‌తో ముగిసింది. సిరాజ్ స్థానంలో అరంగేట్ర పేసర్ గుర్నూర్ బ్రార్‌కు చోటు కల్పించగా, ఆయన లంచ్‌కు ముందు డెవాన్ కాన్వే వికెట్ తీశాడు.
అయితే సిరాజ్‌ను వరుసగా పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ కైఫ్ తదితరులు ప్రశ్నలు లేవనెత్తారు. తొలి టెస్టులోనూ తుది జట్టులో చోటు దక్కని సిరాజ్, ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఉండి ఇలా బయట కూర్చోవడం చర్చనీయాంశమైంది.
మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ను 85 ఓవర్లలో 246/5 వద్ద కట్టడి చేసింది. టామ్ లాథమ్ (59), టామ్ బ్లండెల్ (53 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (36 నాటౌట్) రాణించగా, భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు, గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.




