హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన రక్షణ రంగ టెక్నాలజీ సంస్థ అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (AMSL) కీలక కొనుగోలుకు ముందడుగు వేసింది. తన అనుబంధ సంస్థ 'అపోలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్' ద్వారా బెంగళూరుకు చెందిన ఐఈసీ గ్రూప్ లో 100 శాతం యాజమాన్య హక్కుల కొనుగోలుకు బైండింగ్ ఈవోఐ (EOI) జారీ చేసినట్లు సోమవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు తెలిపింది.

ఈ ప్రతిపాదన కింద ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఐఈ పవర్ టెక్నాలజీస్ లో 100 శాతం ఈక్విటీతో పాటు ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ వ్యాపారం, గుర్తించిన భూఆస్తులను కొనుగోలు చేయనున్నారు. డ్యూ డిలిజెన్స్, బోర్డు, చట్టబద్ధమైన ఆమోదాలు పూర్తయిన తర్వాత తుది ఒప్పందాల సమయంలో కొనుగోలు ధరను వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.

1982లో స్థాపితమైన ఐఈసీ గ్రూప్ ఎలక్ట్రికల్ రొటేటింగ్ మెషిన్లు, జనరేటర్లు, డ్రైవ్ లను తయారు చేస్తుంది. అపోలో మైక్రో సిస్టమ్స్ కు చెందిన ఎలక్ట్రానిక్స్, గైడెన్స్, డీఆర్ డీవో ఆయుధ వ్యవస్థలకు ఐఈసీ గ్రూప్ విద్యుత్ ప్రొపల్షన్, ఆన్ బోర్డ్ పవర్ సామర్థ్యాలు తోడవనున్నాయి.

సోమవారం మార్కెట్ విలువ ₹15,820.85 కోట్లుగా నమోదైన అపోలో మైక్రో సిస్టమ్స్, హైదరాబాద్ లోని టీఎస్ఐఐసీ హార్డ్ వేర్ పార్క్ ఫేజ్-2లో 22,988 చదరపు మీటర్ల స్థలంలో ₹300 కోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక వేస్తోంది.