హామిల్టన్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా మంగళవారం సెడాన్ పార్క్‌లో మూడో వన్డే ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్, 7.30కు మ్యాచ్ మొదలవుతాయి.
సిరీస్ ఇప్పటివరకు
- తొలి వన్డే: భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపు; కోహ్లీ 74 పరుగులు.
- రెండో వన్డే (వెల్లింగ్టన్): కివీస్ 134కే పరిమితం; భారత్ 113/7 వద్ద ఉండగా వర్షం; డీఎల్‌ఎస్ ప్రకారం 4 పరుగులతో భారత్ విజయం.
కివీస్‌కు గాయాల దెబ్బ
కుడి కాలి పిక్క కండరం చీలడంతో లాకీ ఫెర్గూసన్ చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. వెల్లింగ్టన్‌లో హెల్మెట్‌కు బంతి తగలడంతో తప్పనిసరి ఏడు రోజుల విశ్రాంతిలో ఉన్న బ్లెయిర్ టిక్నర్ కూడా తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడడు. కవర్‌గా క్రిస్టియన్ క్లార్క్‌ను జట్టులోకి తీసుకున్నారు.
హామిల్టన్‌లో సోమవారం వర్షం కారణంగా భారత ప్రాక్టీస్ సెషన్ నిలిచిపోయింది. మ్యాచ్ రోజు ఉదయం, మధ్యాహ్నం జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. భారత జట్టుకు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు; హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో ఉన్నారు.




