హైదరాబాద్: తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ గారగ కృష్ణ ప్రసాద్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ గెలుచుకుంది. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఫైనల్‌లో ఐదో సీడ్ సాయి ప్రతీక్–రూబన్ కుమార్ జోడీపై 21-12, 21-18తో కేవలం 34 నిమిషాల్లోనే విజయం సాధించింది.
కాకినాడకు చెందిన కృష్ణ ప్రసాద్ (26) 2022లో థామస్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు. 2024 ఫిబ్రవరిలో అవుటాఫ్ కాంపిటీషన్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఆయనపై నాలుగేళ్ల నిషేధం పడింది. పదార్థాన్ని బయటి నుంచి తీసుకున్నట్లు శాస్త్రీయ ఆధారాలు లేవంటూ నాడా అప్పీల్ ప్యానెల్ ఈ ఏడాది జనవరిలో ఆ నిషేధాన్ని కొట్టివేసి, ఆయన ఫలితాలు, ర్యాంకింగ్‌ను పునరుద్ధరించింది. విశేషం ఏమిటంటే ఈ ఫైనల్‌లో ఆయన ప్రత్యర్థి సాయి ప్రతీక్ గతంలో ఆయన డబుల్స్ భాగస్వామే.
ఇతర విభాగాల విజేతలు
- పురుషుల సింగిల్స్: తుషార్ సువీర్; భరత్ రాఘవ్‌పై 15-21, 21-18, 21-19
- మహిళల సింగిల్స్: రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్; రుజుల రాముపై 16-21, 21-15, 21-14
- మహిళల డబుల్స్: మెయి సుడో–మై తనబే (జపాన్)
- మిక్స్‌డ్ డబుల్స్: రోడియన్ అలిమోవ్–అలీనా దవ్లెతోవా; సతీశ్ కుమార్–అశ్విని పొన్నప్ప జోడీ రన్నరప్




