గుంటూరు / అమరావతి: క్వాంటమ్ టెక్నాలజీ, AI రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దేందుకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నీలిట్ (NIELIT) డీమ్డ్ వర్సిటీ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU)లో తన తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు ఎ. ప్రతిభ, నీలిట్ డైరెక్టర్ జనరల్ మదన్ మోహన్ త్రిపాఠి శనివారం దీన్ని ప్రారంభించగా, డిసెంబర్ 1 నుంచి శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి.

తాత్కాలిక క్యాంపస్ లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, చిప్ డిజైన్-VLSI, AI-కంప్యూటింగ్ కోసం ₹47 కోట్లతో నాలుగు ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నారు. జనవరి నుంచి 10 అడ్వాన్స్ డ్ సర్టిఫికెట్ కోర్సులతో పాటు 16 స్వల్పకాలిక కోర్సులను నిర్వహించనున్నారు.

అమరావతిలోని నిడమర్రులో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ₹730.70 కోట్ల అంచనా వ్యయంతో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టులో ఆమోదం తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 8,250 మందికి (డిగ్రీ కోర్సుల్లో 1,650, నైపుణ్యాభివృద్ధిలో 6,600 మంది) శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ పై విద్యార్థులకు ప్రత్యక్ష పరిశోధన అవకాశం లభించనుందని అధికారులు తెలిపారు. తిరుపతిలోనూ మూడు ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ ను నీలిట్ ప్రతిపాదించింది.