కాకినాడ: సముద్ర రవాణా, పోర్టు సేవల రంగంలో ఉన్న ముంబై సంస్థ జేఎం బక్సీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కీలక విస్తరణ చేపట్టింది. గ్రూప్ అనుబంధ సంస్థ జేఎం బక్సీ మెరైన్ సర్వీసెస్ కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్న శాన్ మారిటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువను ఇరు సంస్థలు వెల్లడించలేదు.

కాకినాడలో ఉన్న శాన్ మారిటైమ్ ప్రస్తుతం 40కి పైగా నౌకలను నిర్వహిస్తోంది. వీటిలో ఆఫ్‌షోర్ సప్లై వెస్సెల్స్, టగ్‌లు, క్రూ బోట్లు, బంకర్ బార్జ్‌లు, క్రేన్ బార్జ్‌లు, జాక్-అప్ బార్జ్‌లు ఉన్నాయి. కాకినాడలోని దీని షిప్‌యార్డుకు 80 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 7,500 డీడబ్ల్యూటీ సామర్థ్యం వరకు నౌకలను నిర్మించే సదుపాయం ఉంది.

నౌకా నిర్మాణం, మరమ్మతులపై దృష్టి

శాన్ మారిటైమ్ షిప్‌యార్డులోని రెండు వాటర్‌ఫ్రంట్ విభాగాల్లో ఒక్కోచోట ఒకేసారి నాలుగు నౌకల వరకు నిర్మించవచ్చు. దేశీయ నౌకా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం గతేడాది ₹69,725 కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన పోర్టులలో 12 కన్సెషన్లను నిర్వహిస్తున్న జేఎం బక్సీ గ్రూప్ గత దశాబ్దంలో సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. నౌకా నిర్మాణంతో పాటు షిప్ రిపేర్లు, డ్రైడాకింగ్, తీరప్రాంత ఇంటర్నెట్ కేబుల్ లేయింగ్, ఎనర్జీ లాజిస్టిక్స్ విభాగాల్లోనూ విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.