తిరుపతి: దాదాపు శతాబ్ద కాలంగా శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలకు నిలయంగా ఉన్న తిరుపతిలోని త్యాగరాజ మండపంలో శ్రీ త్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన బహుళ ప్రయోజన ఫంక్షన్ హాల్‌ను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రారంభించారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని, శాస్త్రీయ సంగీతం, నృత్యం భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రధాన సాధనాలని పీఠాధిపతి ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఆధునిక వసతులతో నిర్మించిన ఈ హాల్ ద్వారా త్యాగరాజ మండపం వార్షిక సంగీతోత్సవ సంప్రదాయం మరింత విస్తరించనుంది.

అనంతరం శ్రీ కంచి వేద వేదాంత శాస్త్ర సభ వార్షిక స్నాతకోత్సవం (దీక్షాంత సమారోహః) నిర్వహించారు. న్యాయ, వ్యాకరణ, మీమాంస, వేదాంత, అద్వైత సిద్ధి రత్నాకర, పతంజలి మహాభాష్యం, భామతీ ప్రస్థానం, వేద భాష్యంలో 12 నుంచి 14 సెమిస్టర్ల అధ్యయనాన్ని పూర్తి చేసిన 125 మంది పండితులకు పురస్కారాలు అందజేశారు.

ఈ పురస్కార గ్రహీతల్లో కఠినమైన 'తెనాలి పరీక్ష' ఉత్తీర్ణులైన 15 మంది పండితులు కూడా ఉండటం విశేషం.