విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులోని MGM పార్క్ శుక్రవారం సాయంత్రం వేలాది దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), హిందూ ధర్మ ప్రచార పరిషత్ (HDPP), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం ఘనంగా జరిగింది.

వందలాది మహిళా భక్తులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఒకేసారి దీపాలు వెలిగించి సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ముందుగా అర్చకులు దీపపూజ ప్రాశస్త్యాన్ని వివరించి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మి ఆరాధన, అష్టోత్తర శతనామావళి, కుంకుమార్చన నిర్వహించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. అనంతరం భక్తులతో మూడుసార్లు దీపమంత్రాన్ని పఠింపజేసి, నక్షత్ర హారతి, కుంభహారతి సమర్పించారు.

సకల జనులకు సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థించారు. SVBC ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, HDPP కార్యదర్శి డా. మేడసాని మోహన్, CPRO డా. టి. రవి తదితరులు పాల్గొన్నారు.