భద్రాచలం: గోదావరి నదీ తీరం వెంబడి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను అనుసంధానిస్తూ ప్రత్యేక 'టెంపుల్ కారిడార్'ను అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న శిలా నిర్మాణ, పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు.

2027 గోదావరి పుష్కరాల సన్నాహాల కోసం ప్రభుత్వం ₹1,100 కోట్లు కేటాయించగా, అందులో ₹300 కోట్లతో భద్రాద్రి ఆలయంలో 200 ఏళ్ల పాటు చెక్కుచెదరని రీతిలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. రాబోయే గోదావరి పుష్కరాలకు కోటి మందికి పైగా భక్తులు భద్రాచలం వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

డిసెంబర్ 20న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, డిసెంబర్ 19–20 లోపే ప్రధాన ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేబినెట్ సబ్-కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల ప్రగతిని సమీక్షిస్తోంది.

వీటితో పాటు రంగనాయకులగుట్ట వద్ద ₹5.45 కోట్ల తాగునీటి రిజర్వాయర్, ₹1 కోటితో గిరిజన బహుళార్థక మార్కెట్ సెంటర్, పర్ణశాల ఘాట్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.