తిరుమల: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు జరగనున్న పది రోజుల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల సౌకర్యార్థం టీటీడీ శుక్రవారం ఆన్లైన్ కోటా విడుదల షెడ్యూల్ను ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా భక్తులు టికెట్లు, టోకెన్లు నమోదు చేసుకోవచ్చు.
నవంబర్ 28 ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదలవుతుంది. నవంబర్ 30 ఉదయం 10 గంటలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు రోజుకు 15,000 చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్లను అందుబాటులో ఉంచుతారు.
వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 20), ద్వాదశి (డిసెంబర్ 21) రోజుల్లో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్ల కోసం డిసెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఈ-డిప్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ టోకెన్లను కేటాయిస్తారు. దాతల దర్శన కోటా డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది.
సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రద్దు చేసింది. మిగిలిన ఎనిమిది రోజులు (డిసెంబర్ 22–29) టోకెన్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి అనుమతిస్తారు.




