తిరుమల / తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 20 (వైకుంఠ ఏకాదశి) నుంచి డిసెంబర్ 29 వరకు జరగనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఖరారు చేసింది.

శనివారం (నవంబర్ 28) ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదలవుతుంది. నవంబర్ 30 ఉదయం 10 గంటలకు డిసెంబర్ 22–29 తేదీలకు సంబంధించి రోజుకు 15,000 చొప్పున ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 20), ద్వాదశి (డిసెంబర్ 21) రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనం, ₹300 ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే రద్దు చేసింది. ఆ రెండు రోజులకు డిసెంబర్ 1 ఉదయం 10 నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఈ-డిప్‌లో నమోదు చేసుకున్న వారికి డిసెంబర్ 7 మధ్యాహ్నం 3 గంటలకు సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు.

డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు దాతల కోటా టికెట్లు విడుదలవుతాయి. డిసెంబర్ 22–29 మధ్య టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారానే బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.