అమరావతి: అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్) తన అమరావతి క్యాంపస్ కార్యకలాపాలను ప్రారంభించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, AI, చిప్ డిజైన్ రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాటైన దేశంలోనే తొలి విశ్వవిద్యాలయ క్యాంపస్ ఇది.

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) ప్రాంగణంలో తాత్కాలికంగా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో క్వాంటమ్, వీఎల్‌ఎస్‌ఐ (VLSI), AI పరిశోధనల కోసం నైలిట్ ₹47 కోట్లతో అత్యాధునిక ల్యాబ్‌లను నిర్మిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోని ఐబీఎం (IBM) క్వాంటమ్ కంప్యూటర్‌పై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ పొందే అవకాశం లభించనుంది.

రాబోయే డిసెంబర్ నెల నుంచి ఇక్కడ 10 అడ్వాన్స్‌డ్ కోర్సులు, 16 స్వల్పకాలిక కోర్సులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఐదేళ్లలో 8,250 మంది విద్యార్థులు, నిపుణులకు ఈ క్యాంపస్ ద్వారా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాగా, అమరావతిలో నైలిట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం ₹730.70 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.