హైదరాబాద్ / పారిస్: అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతున్న తెలంగాణకు మరో భారీ విదేశీ పెట్టుబడి రానుంది. ఫ్రాన్స్ కు చెందిన సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ సంస్థ రాష్ట్రంలో సుమారు ₹4,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు పరిశీలిస్తోంది.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి నవంబర్ 21న పారిస్ సమీపంలోని ఎవ్రీ-కార్బెల్ లో ఉన్న సఫ్రాన్ కేంద్రాన్ని సందర్శించారు. సఫ్రాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌవే, రొటేటింగ్ పార్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ జూలియన్ డి ఒరాజియోతో వారు విస్తరణ ప్రణాళికలపై చర్చించారు.
డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో సఫ్రాన్ తో కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరే అవకాశం ఉంది. అయితే, ఈ ₹4,000 కోట్ల పెట్టుబడి కింద ఏర్పాటు చేయబోయే నిర్దిష్ట ప్లాంట్ల వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
సఫ్రాన్ కు ఇప్పటికే హైదరాబాద్ లో లీప్ ఇంజిన్ రొటేటింగ్ పార్ట్స్ తయారీ కేంద్రం, సఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ యూనిట్, ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ ఎంఆర్వో కేంద్రాల్లో ఒకటి ఉన్నాయి. మరోవైపు, తెలంగాణలో 5 వేల మందికి పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థను డేటా సెంటర్లు, ఆటోమేషన్ రంగంలో విస్తరించాలని భట్టి విక్రమార్క పారిస్ లో ఆహ్వానించారు.




