లఖ్‌నవూ: బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు మంగళవారం తెలుగు షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లఖ్‌నవూలోని బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫికేషన్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సూర్య చరిష్మా తమిరి 21-14, 21-19తో చైనీస్ తైపీ క్రీడాకారిణి వాంగ్ పెయ్ యుపై గెలిచింది.

హైదరాబాద్ షట్లర్ ఇమాద్ ఫారూఖీ సమీయా 16-21, 15-21తో థాయ్‌లాండ్ క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో కృష్ణప్రసాద్ గరగ–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ ఫ్రాన్స్ జంట చేతిలో 21-23, 21-18, 17-21తో పోరాడి ఓడింది.

అలాగే అచ్యుతాదిత్య రావు దొడ్డవరపు–పోచన అర్జున్ రెడ్డి జోడీ 7-21, 10-21తో 5వ సీడ్ తైపీ జంట చేతిలో, సాయి ప్రతీక్–రూబన్ కుమార్ జోడీ 17-21, 22-20, 19-21తో 8వ సీడ్ ఇంగ్లాండ్ జంట చేతిలో పరాజయం పొందాయి. మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయర్స్‌లో విష్ణు కేదార్ కోడే–హీరల్ చౌహాన్ జోడీ ఓడింది.

తదుపరి పరిణామాలు: బుధవారం (నవంబర్ 25) సింగిల్స్ మెయిన్ డ్రా పోటీలు ప్రారంభమవుతాయి. రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్లైన గాయత్రి గోపీచంద్–ట్రీసా జాలీ హ్యాట్రిక్ టైటిల్‌పై, పురుషుల సింగిల్స్‌లో తరుణ్ మన్నేపల్లిపై అందరి దృష్టి ఉంది.