హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2026–27 సీజన్‌లో బుధవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఆంధ్ర జట్టు విజయం సాధించగా, హైదరాబాద్ జట్టుకు ఓటమి ఎదురైంది.

మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. సీరం వెంకట రాహుల్ (30 బంతుల్లో 64), షేక్ రషీద్ (39 బంతుల్లో 60), అశ్విన్ హెబ్బార్ (15 బంతుల్లో 37), మారంరెడ్డి హేమంత్ రెడ్డి (16 బంతుల్లో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది. ఆంధ్ర బౌలర్లలో కాళింది రాజు (2/33), కె.వి. శశికాంత్ (2/42) రాణించారు.

మరోవైపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో విదర్భతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 195 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (24 బంతుల్లో 49), కోడిమెల హిమతేజ (33 బంతుల్లో 41) రాణించారు.

లక్ష్య ఛేదనలో విదర్భ ఓపెనర్ అథర్వ తైడే (45 బంతుల్లో 82) చెలరేగడంతో విదర్భ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి విజయం సాధించింది. హైదరాబాద్ తదుపరి మ్యాచ్‌లో నవంబర్ 20న గోవాతో తలపడనుంది.