హైదరాబాద్: తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగానికి మరో భారీ పెట్టుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ శాఫ్రాన్ (Safran) రాష్ట్రంలో సుమారు ₹4,000 కోట్ల పెట్టుబడితో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం.

పారిస్ సమీపంలోని శాఫ్రాన్ తయారీ కేంద్రాన్ని శనివారం సందర్శించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఇరు పక్షాలు చర్చించాయి.

శాఫ్రాన్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. ముఖ్యంగా 'లీప్' (LEAP) విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఎంఆర్‌ఓ (MRO) కేంద్రాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.

డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని శాఫ్రాన్ ప్రతినిధి బృందాన్ని భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ సదస్సులోనే ₹4,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.