హైదరాబాద్: డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు ముందు తెలంగాణ ప్రభుత్వం ముంబైలో పెట్టుబడిదారుల రోడ్‌షో నిర్వహించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముంబై పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమయ్యారు.
తెలంగాణలో సమతుల్య ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం మూడు ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తోందని మంత్రి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్’ (Core Urban Region Economy), శివారు పారిశ్రామిక కారిడార్‌ను ‘ప్యూర్’ (Peri-Urban Region Economy), గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను ‘రేర్’ (Rural and Agri Region Economy) మండళ్లుగా విభజించినట్లు తెలిపారు.
ఈ రోడ్‌షోలో టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ శశాంక, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొని రాష్ట్రంలోని పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
డిసెంబర్ 7న ప్రారంభమయ్యే గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా స్టార్టప్ అరీనా కోసం దరఖాస్తుల గడువు నవంబర్ 20తో ముగియనుంది. సదస్సులో 14 ప్రధాన రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




