హైదరాబాద్: హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రగామి డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు 2029 నాటికి 5 గిగావాట్ల (GW) డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం ప్రజాభవన్‌లో డేటా సెంటర్ నిర్వాహకులు, గ్రీన్ ఎనర్జీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రణాళికను వెల్లడించారు.
ప్రస్తుతం తెలంగాణలో 300 మెగావాట్ల (MW) డేటా సెంటర్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, మరో 2 గిగావాట్ల ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. వేగంగా విస్తరిస్తున్న AI అవసరాల వల్ల డేటా సెంటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోందని చెప్పారు.
హైదరాబాద్‌లో తేమ తక్కువగా ఉండే వాతావరణం డేటా సెంటర్లకు అనుకూలమని పేర్కొన్న భట్టి విక్రమార్క, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇంధన, ఐటీ, పరిశ్రమల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
అయితే హైదరాబాద్‌లో 264 ఎకరాల టీసీఎస్ AI డేటా సెంటర్ సహా భారీ డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ వనరులపై అసెంబ్లీలోనూ, ప్రజల్లోనూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ భాగస్వాములతో ఈ భేటీ నిర్వహించింది. డిసెంబర్ 7–9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు రావాలని నిర్వాహకులను ఆయన ఆహ్వానించారు.




