హైదరాబాద్: తెలంగాణ టెక్నాలజీ స్టార్టప్ రంగంలో పెట్టుబడుల విలువ భారీగా పెరిగింది. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30, 2026 మధ్య రాష్ట్రంలోని టెక్ సంస్థలు 726 మిలియన్ డాలర్ల ఈక్విటీ నిధులను సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన 199 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 266 శాతం అధికమని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్స్న్ టెక్నాలజీస్ తన 'తెలంగాణ టెక్ 9ఎం 2026' నివేదికలో పేర్కొంది.
అయితే నిధుల విలువ పెరిగినప్పటికీ, ఫండింగ్ రౌండ్ల సంఖ్య 105 నుంచి 30 శాతం తగ్గి 73కు చేరింది. సగటు డీల్ విలువ 1.9 మిలియన్ డాలర్ల నుంచి 9.9 మిలియన్ డాలర్లకు పెరిగింది. మొత్తం నిధుల్లో 91 శాతం అంటే 664 మిలియన్ డాలర్లు టాప్-10 డీల్స్లోనే వచ్చాయి.
CtrlS, స్కైరూట్ ఏరోస్పేస్ హవా
హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ CtrlS జూన్‌లో సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ మద్దతుతో 423 మిలియన్ డాలర్ల సిరీస్-బీ నిధులు సమీకరించింది. రాష్ట్రం మొత్తం నిధుల్లో 58 శాతం ఒక్క ఈ డీల్ నుంచే వచ్చాయి. అంతకుముందు ఫిబ్రవరిలో ఆ సంస్థ 28.2 మిలియన్ డాలర్లు సమీకరించింది. మే నెలలో హైదరాబాద్ స్పేస్-టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ 60 మిలియన్ డాలర్ల సిరీస్-సీ రౌండ్‌తో తెలంగాణలో కొత్త యూనికార్న్‌గా అవతరించింది.
ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 454 మిలియన్ డాలర్లు (మొత్తం నిధుల్లో 63 శాతం) ఆకర్షించగా, ఏరోస్పేస్-డిఫెన్స్ టెక్ కంపెనీలకు 78.5 మిలియన్ డాలర్లు లభించాయి. తెలంగాణలో వచ్చిన మొత్తం టెక్ నిధులు 100 శాతం హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి.




