హైదరాబాద్: 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి తొమ్మిది నెలల్లో తెలంగాణ టెక్ స్టార్టప్ లు, టెక్ సంస్థలు మొత్తం $726 మిలియన్ల (ఈక్విటీ) నిధులను సమీకరించాయి. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన $199 మిలియన్లతో పోలిస్తే ఇది 266 శాతం అధికమని ట్రాక్సన్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
నిధుల విలువ భారీగా పెరిగినా, డీల్స్ సంఖ్య మాత్రం 105 నుంచి 30 శాతం తగ్గి 73 రౌండ్లకు పరిమితమైంది. దీంతో సగటు రౌండ్ పరిమాణం $1.9 మిలియన్ల నుంచి $9.9 మిలియన్లకు పెరిగింది. టాప్ 10 డీల్స్ లోనే $664 మిలియన్లు (91 శాతం) సమకూరాయి.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డేటా సెంటర్ సంస్థ కంట్రోల్-ఎస్ జూన్ లో సీపీపీ ఇన్వెస్ట్ మెంట్స్ నుంచి $423 మిలియన్లు (మొత్తం నిధుల్లో 58 శాతం), ఫిబ్రవరిలో $28.2 మిలియన్లు కలిపి మొత్తం $451 మిలియన్లు అందుకుంది. మేలో $60 మిలియన్లు సమీకరించిన స్కైరూట్ ఏరోస్పేస్ బిలియన్ డాలర్ల విలువతో 9M 2026లో తెలంగాణ నుంచి ఏకైక కొత్త యునికార్న్ గా నిలిచింది. ఎడుబుక్ $50 మిలియన్లు సేకరించింది.
ప్రారంభ దశ (ఎర్లీ స్టేజ్) నిధులు 334% పెరిగి $622 మిలియన్లకు చేరగా, సీడ్ నిధులు 35% తగ్గి $26.4 మిలియన్లకు పరిమితమయ్యాయి. స్కైరూట్, కంట్రోల్-ఎస్ విజయాలు హైదరాబాద్ కేవలం సేవలకే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సంస్థలకు కేంద్రంగా మారుతోందని నిరూపిస్తున్నాయని టీ-హబ్ మాజీ సీఈవో ఎం. శ్రీనివాసరావు పేర్కొన్నారు.




