హైదరాబాద్: రోజూ బస్సుల్లో ప్రయాణించేవారికి టీజీఎస్‌ఆర్టీసీ ఊరట కల్పించింది. నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) దారులకు తొమ్మిది కొత్త రాయితీలు ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ఇవి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం వెల్లడించింది.

తొమ్మిది రాయితీలు

  • మహిళలకు: టోల్‌తో కలిపి నెల పాస్ ఛార్జీ 20 రోజులకు కాకుండా 15 రోజులకే లెక్కింపు
  • ఆదివారం ఉచితం: హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్‌లలో అన్ని రకాల సిటీ బస్సుల్లో ఎంఎస్‌టీదారులకు ఆదివారం ఉచిత ప్రయాణం (పుష్పక్ ఎయిర్‌పోర్ట్ బస్సులు, ఇతర ప్రభుత్వ సెలవులు మినహా)
  • దూర పరిమితి ఎత్తివేత: నిర్దేశిత మార్గాల్లో దూరంతో సంబంధం లేకుండా పాసులు
  • టోల్ ఛార్జీ: 25 రోజులకు బదులు 20 రోజులకే లెక్కింపు
  • కొత్తగా డీలక్స్ ఎంఎస్‌టీ: డీలక్స్, ఇ-డీలక్స్ బస్సుల్లో చెల్లుబాటు
  • కాంబి టికెట్: ప్రయాణానికి ₹20 అదనంగా చెల్లిస్తే పల్లె వెలుగు పాస్‌తో ఎక్స్‌ప్రెస్, ఇ-ఎక్స్‌ప్రెస్‌లో; ఎక్స్‌ప్రెస్ పాస్‌తో డీలక్స్, ఇ-డీలక్స్‌లో ప్రయాణం
  • 10% తగ్గింపు: తమ మార్గం కాకుండా వేరే మార్గాల్లో సూపర్ లగ్జరీ, ఆపై కేటగిరీ బస్సుల్లో బేసిక్ ఛార్జీపై
  • రెండు నెలల పాస్: అదనంగా 5 రోజుల గడువు ఉచితం
  • మూడు నెలల పాస్: అదనంగా 10 రోజుల గడువు ఉచితం

కాంబి టికెట్ సదుపాయం కింద పల్లె వెలుగు పాస్‌దారులకు డీలక్స్, ఇ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణానికి అనుమతి లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. దైనందిన బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా, సౌకర్యవంతంగా మార్చడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సంస్థ పేర్కొంది.