దోహా: దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో గురువారం జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (50 ఓవర్ల) తొలి సెమీఫైనల్లో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత్-A జట్టుకు నిరాశ ఎదురైంది. భారత్-A నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక-A 41.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించి 8 వికెట్లతో ఫైనల్ చేరింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-A నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 78 (63 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ తిలక్ వర్మ 53 పరుగులు (66 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చేసి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. వైభవ్ సూర్యవంశీ 40, షాబాజ్ అహ్మద్ 54* (48 బంతుల్లో 4 సిక్సర్లు) రాణించారు.

లక్ష్య ఛేదనలో భారత ఫీల్డింగ్ లోపాలు దెబ్బతీశాయి. తొలి రెండు ఓవర్లలోనే ఇద్దరు లంక ఓపెనర్లకు క్యాచ్‌లు జారవిడవడంతో లసిత్ క్రూస్‌పుల్లె (116; 107 బంతుల్లో), సినెత్ జయవర్ధనే (105; 70 బంతుల్లో) తొలి వికెట్‌కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అనంతరం నిషాన్ మధుష్క (58*), పవన్ రత్నాయకే (31*) జట్టును విజయతీరాలకు చేర్చారు. శుక్రవారం పాకిస్థాన్-A, బంగ్లాదేశ్-A మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం (నవంబర్ 29) ఫైనల్లో శ్రీలంక-A తలపడనుంది.