లక్నో: బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న 2.50 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో హైదరాబాద్ అకాడమీ షట్లర్లు గాయత్రి గోపీచంద్ పుల్లెల, ట్రీసా జాలీ జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ జోడీ కేవలం 24 నిమిషాల్లో రష్మీ గణేశ్, అమృతా ప్రముతేశ్‌లను 21-8, 21-7తో ఓడించింది.

చరిత్రాత్మక హ్యాట్రిక్ దిశగా

2024, 2025లో ఈ టోర్నీ టైటిళ్లు గెలుచుకున్న గాయత్రి-ట్రీసా జోడీ, ఈ ఏడాది కూడా విజేతగా నిలిస్తే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ చరిత్రలో ఏ విభాగంలోనైనా వరుసగా మూడు టైటిళ్లు సాధించిన తొలి ప్లేయర్లుగా రికార్డు సృష్టిస్తారు.

మిగతా తెలుగు షట్లర్ల ఫలితాలు

బుధవారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి కనపురం-రేషిక ఉదయసూరియన్ జోడీ మలేషియా ఆరో సీడ్ వాంగ్ టియెన్ సి-లిమ్ చివ్ సియెన్‌ను 24-22, 14-21, 21-15తో (55 నిమిషాలు) సంచలన ఓటమి పాలు చేసింది. పురుషుల డబుల్స్‌లో భార్గవ్ రామ్ ఆరిగెల-విశ్వ తేజ్ గొబ్బురు జోడీ 16-21, 21-12, 21-15తో గెలిచింది. అయితే గద్దె రుత్విక శివానీ-రోహన్ కపూర్ జోడీ 2-8 వద్ద 3 నిమిషాల్లోనే రిటైర్డ్ హర్ట్‌గా వైదొలిగింది. గురువారం (నవంబర్ 26) ప్రిక్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి.