హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ నాట్కో ఫార్మాకు చెందిన కొత్తూరు ఫార్ములేషన్స్ ప్లాంట్‌పై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఏడు అభ్యంతరాలు జారీ చేసింది. నవంబర్ 12 నుంచి 20 వరకు యూఎస్ ఎఫ్‌డీఏ అధికారులు ఈ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీ ముగిసిన అనంతరం ఫామ్-483 కింద ఏడు అభ్యంతరాలు అందినట్లు నాట్కో ఫార్మా నవంబర్ 21న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన నియంత్రణ ఫైలింగ్‌లో వెల్లడించింది. చట్టపరమైన నిబంధనల ఉల్లంఘనలకు దారితీసే పరిస్థితులు కనిపించినప్పుడు తనిఖీ అధికారులు ఫామ్-483 జారీ చేస్తారు.
ప్రధాన కార్యకలాపాలపై ప్రభావం లేదు
కొత్తూరు ప్లాంట్‌లో గుర్తించిన ఏడు అభ్యంతరాలు కేవలం ప్రక్రియాపరమైనవని నాట్కో ఫార్మా పేర్కొంది. నిర్దేశించిన గడువులోగా వీటిని సమగ్రంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రధాన తయారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న నాట్కో ఫార్మా ఫార్ములేషన్స్ ప్లాంట్‌కు ఊరట లభించింది. ఆగస్టు 2026లో జరిగిన తనిఖీకి సంబంధించి (అప్పట్లో నాలుగు అభ్యంతరాలు వచ్చాయి) యూఎస్ ఎఫ్‌డీఏ 'వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్' (వీఏఐ) వర్గీకరణ ఇచ్చినట్లు కంపెనీ నవంబర్ 20న ప్రకటించింది.




