బుడాపెస్ట్: హంగేరీలోని బుడాపెస్ట్ లో ముగిసిన తొలి టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టూర్ పైలట్ టోర్నమెంట్ లో తెలంగాణలోని వరంగల్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశి భారత ఆటగాళ్లలో అత్యుత్తమంగా పదో స్థానంలో నిలిచారు. 2027లో పూర్తిస్థాయి టూర్ ప్రారంభానికి ముందు బ్లిట్జ్, ర్యాపిడ్, ఫాస్ట్ క్లాసిక్ విభాగాల కలయికతో ఈ పైలట్ టోర్నీని నిర్వహించారు.
9–10 స్థానాల కోసం అర్మేనియా గ్రాండ్ మాస్టర్ హైక్ మార్టిరోస్యాన్ తో జరిగిన రెండో రోజు పోరులో అర్జున్ బ్లిట్జ్ విభాగంలో నాలుగు గేమ్ లలో మూడు గెలిచి 3–1 ఆధిక్యం సాధించారు. అయితే ర్యాపిడ్ లో పుంజుకున్న మార్టిరోస్యాన్, నిర్ణయాత్మక ఫాస్ట్ క్లాసిక్ గేమ్ లో తెల్లపావులతో గెలిచి రెండో రోజును 11–9తో దక్కించుకున్నారు. తొలి రోజు కూడా మార్టిరోస్యాన్ దే పైచేయి అయింది.
ఈ టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లలో ఆర్. ప్రజ్ఞానంద 21వ స్థానంలో (రెండో రోజు అభిమన్యు మిశ్రాపై 15–5 విజయం), ఆర్. వైశాలి 24వ స్థానంలో (నోదిర్బెక్ అబ్దుసత్తరోవ్ చేతిలో 0–20 ఓటమి) నిలిచారు.
ఫైనల్ లో అనీష్ గిరిపై ఆర్మగెడన్ టైబ్రేక్ లో విజయం సాధించిన అలీరెజా ఫిరౌజా టైటిల్ కైవసం చేసుకోగా, ఫాబియానో కరువానా మూడో స్థానం, మాగ్నస్ కార్ల్ సన్ 17వ స్థానం పొందారు.




