విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లోని బౌద్ధ వారసత్వ క్షేత్రాలను అంతర్జాతీయ పర్యాటక రంగంతో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఏషియాన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ సందర్భంగా సోమవారం విశాఖపట్నంలో థాయ్ లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్ తో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు.
అమరావతి ప్రాంతంలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దాన్ని థాయ్ మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థలతో అనుసంధానించాలని లోకేశ్ ప్రతిపాదించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్య నాగార్జున పేరిట బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటులో థాయ్ విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.
బోధ్ గయా తరహాలో థాయ్ బౌద్ధ భిక్షువులు, యాత్రికుల కోసం అమరావతి మహాచైత్య స్థూపం కేంద్రంగా నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండ, శాలిహుండం, బొజ్జన్నకొండలను కలుపుతూ ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్ ను ప్రతిపాదించారు. విశాఖపట్నం-థాయ్ లాండ్ మధ్య క్రూయిజ్, తీరప్రాంత పర్యాటకంతో పాటు టికా (TICA), ఏపీఎస్ఎస్ డీసీ మధ్య నైపుణ్యాభివృద్ధి సహకారంపైనా చర్చించారు.
ఏషియాన్ దేశాలతో భారత్ జరిపే మొత్తం వాణిజ్యంలో థాయ్ లాండ్ వాటా 16.7 శాతంగా ఉందని రాయబారి చవనార్ట్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.




