తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న సుమారు 60 గ్రాముల బంగారు ఆభరణాలను TTD కమాండ్ కంట్రోల్ బృందం శనివారం కొన్ని గంటల్లోనే గుర్తించి సురక్షితంగా అప్పగించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జి. మహేష్ CRO కార్యాలయం బస్టాండ్ వద్ద కారు దిగుతున్న సమయంలో పొరపాటున ఈ ఆభరణాలను జారవిడుచుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే నిఘా, భద్రతా విభాగం సిబ్బంది కమాండ్ కంట్రోల్ కెమెరాల సాయంతో ఆభరణాలను గుర్తించి బాధిత భక్తుడికి తిరిగి అందజేశారు. సిబ్బంది చాకచక్యాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

మరోవైపు నవంబర్ 27న తిరుమలలో 63,645 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 28,029 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా ₹3.98 కోట్ల కానుకలు లభించాయి.

అదే రోజు 3.76 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.31 లక్షల మందికి అన్నప్రసాదం అందించారు. శనివారం ఉదయం శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతుండగా, టోకెన్లు లేని సర్వదర్శనానికి సుమారు 18–20 గంటల సమయం పడుతోందని TTD తెలిపింది.