హైదరాబాద్‌: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో 'కీర్తి పురస్కారాలు-2025' ప్రదానోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌ పురస్కారాలు అందజేశారు.

విశ్వవిద్యాలయ ప్రతిష్ఠాత్మక 'సాహితీ పురస్కారం' వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్య ధనుంజయ్‌కు ప్రదానం చేశారు.

సాహిత్య విభాగంలో చింతలపాటి మోహన మురళీకృష్ణ (కవిత), వాహిద్‌ (అనువాదం), కామరాజుగడ్డ వాసవదత్త రమణ (ఉత్తమ రచయిత్రి), ఆచార్య పి. కనకయ్య (కథ/నవల), పి. లలిత వాణి (ప్రాచీన సాహిత్యం), ఏడుల గోపిరెడ్డి (హాస్యం), సాంబరాజు రవిప్రకాశ్‌ (జీవిత చరిత్ర), వై. సుభాషిణి, టి. శ్రీరంగస్వామి (సాహిత్య విమర్శ), ఎడ్ల లక్ష్మి (బాల సాహిత్యం) అవార్డులు అందుకున్నారు.

కళలు, మీడియా రంగాల్లో రుక్మభట్ల నరసింహస్వామి (జానపద కళలు), అండే భాస్కర్‌ (సాహిత్యం, సంగీతం), డి. వర్ధని (కర్ణాటక సంగీతం), టి. శ్రావంతి (ఆంధ్రనాట్యం, పేరిణి), పుట్టపాక లక్ష్మణరావు (చిత్రలేఖనం), సరసి (కార్టూనిస్ట్‌), డి.వి. సూర్యారావు (పత్రికారంగం), కె.వి.ఎన్‌. చారి (ఉత్తమ అధ్యాపకుడు) కీర్తి పురస్కారాలు స్వీకరించారు.