హైదరాబాద్: ప్రపంచ వారసత్వ వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC), రాష్ట్ర వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (AKTC) సంయుక్తంగా ఆదివారం ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద ప్రత్యేక 'నేచర్ మీట్స్ హెరిటేజ్' నడకను నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వారసత్వ అభిమానులు, ప్రకృతి ప్రేమికులు, బర్డ్ వాచర్లు పాల్గొన్నారు. చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు ఆ ప్రాంగణంలోని జీవవైవిధ్యాన్ని యువతకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
ముఖ్య అతిథిగా హాజరైన వారసత్వ శాఖ డైరెక్టర్ అర్జున్ రావు కూతడి మాట్లాడుతూ కుతుబ్ షాహీ టూంబ్స్ పర్షియన్, దక్కనీ, భారతీయ వాస్తుశిల్ప శైలుల అద్భుత సమ్మేళనమని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాల చుట్టూ ఉన్న వృక్ష సంపద పక్షుల ఆవాసాలకు ఎలా తోడ్పడుతుందో నిపుణులు వివరించారు.
పక్షుల కూతలు, శారీరక లక్షణాల ఆధారంగా వాటిని గుర్తించే మెలకువలను పాల్గొన్నవారికి నేర్పించారు. స్పాటెడ్ ఔలెట్, బ్లాక్ డ్రోంగో, గ్రీన్ బీ-ఈటర్, కింగ్‌ఫిషర్ సహా 40కి పైగా పక్షి జాతులపై చర్చ జరిగింది. మూడో విడత నడక నవంబర్ 29న జరగనుందని TGTDC ప్రకటించింది.




