హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా శైవ, వైష్ణవ ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. ప్రభుత్వ సాధారణ సెలవు దినం కావడంతో వేకువజాము 4 గంటల నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు.

నగర శివారులోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ కాలనీలలోని శివాలయాల్లో బిల్వదళాలు, పాలు, తేనెతో ప్రత్యేక రుద్రాభిషేకాలు నిర్వహించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీలు బారికేడ్లు, తాగునీరు, అదనపు వాలంటీర్లను ఏర్పాటు చేశాయి.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. హనుమకొండ వేయి స్తంభాల గుడి, చెరువుగట్టు, గూడెం గుట్ట క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి.

భద్రాచలం గోదావరి తీరం, కాళేశ్వరం త్రివేణి సంగమం, అలంపూర్ తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. పంచాంగం ప్రకారం రాత్రి 8:23 గంటల వరకు పౌర్ణమి తిథి ఉండటంతో సాయంత్రం 365 ఒత్తుల దీపారాధన, జ్వాలాతోరణం కార్యక్రమాలు జరగనున్నాయి.