శ్రీశైలం: రెండో కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అంతకుముందు రోజు ఆదివారం (నవంబర్ 22) ఒక్కరోజే 43,247 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ త్వరగా దర్శనం కల్పించేందుకు ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కీలక ఆంక్షలు అమలు చేస్తున్నారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతి శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనం, సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలను నిలిపివేశారు.
సోమవారాల్లో భక్తులకు కేవలం అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే రోజుకు నాలుగు విడతల్లో స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రెండో కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయ ఈశాన్య భాగంలోని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను దేవస్థానం నిర్వహించింది.




