వేములవాడ: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉత్తర తెలంగాణలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు మంగళవారం ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి సుమారు 50,000 మంది భక్తులు దర్శనానికి వచ్చారు.
భక్తులు వేకువజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి, సంప్రదాయ కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సమీపంలోని శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలోనూ బోనాలు, మొక్కులు సమర్పించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి సుమారు 30,000 మంది భక్తులు పోటెత్తారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కోటిలింగాల శ్రీ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలోనూ భారీ రద్దీ నెలకొంది.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, దేవస్థాన కార్యనిర్వహణాధికారి రమాదేవి రద్దీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.
సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయ జ్వాలాతోరణం, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిశి పూజ జరగనున్నాయి. డిసెంబర్ 8 వరకు కార్తీక మాస ప్రత్యేక పూజలు కొనసాగుతాయి.




